- పాత పుస్తకాలూ, దినపత్రికలూ లాటివి కొన్ని పేపరువాడికి అమ్మేస్తుంటే - ఎప్పుడో ’వార్త’ డైలీలో సీరియల్ తాలూకు భద్రపరచబడ్డ క్లిప్పింగ్స్ బయట పడ్డాయి.
- 28.8.2000(సోమవారం) ’వార్త" దినపత్రికలో మొదలైన ఆ డైలీ సీరియల్ (ఓ 42 రోజులు వచ్చిందనుకుంటా-నాకు 42 క్లిప్పింగ్సే దొరికాయి.) పేరు "కనిపించే గతం". రచయిత్రి - ఇంద్రగంటి జానకీబాల.
- రచయిత్రి పరిచయంలో...ఆవిడ నాలుగు కధా సంపుటాలూ, తొమ్మిది నవలలూ, ఒక కవితాసంపుటీ వెలువరించారని ఉంది. వీటిల్లో ఏ ఒక్కటీ చదవకపోవడంచేత ఇదైనా చదువుదామని కూర్చున్నాం గత వారాంతపు ’తీరుబాటులో’.
- ప్రధమ పురుషలో సాగే సీరియల్....జాతిపిత బాపూజీ మరణించిన రోజుకి మూడేళ్ళ వయసు చిన్నారి ’దేవకి’తన బాల్యం నేపద్యంతో రాసుకున్న నవల. తన బాల్యపు 'నిరుపేద బ్రాహ్మణ' జీవన విధాన రీతి....భీతి......ఇంకా ఆ రోజుల్లోని చిరు ఆనందాలూ, ఆడంబరాలూ, ఆర్భాటాలూ, అచ్చట్లూ, ముచ్చట్లూ, ఖేదన రోదనలూ...వగైరాలతో......సాదా సీదా శైలిగా కనిపిస్తూనే.....అనితరసాధ్యపు శైలిలో తీర్చిదిద్దారు రచయిత్రి. ప్రధమ పురుష వాడడం, వాస్తవికతా చిత్రీకరణ .... వీటితో ’ఆత్మకధేమో’ అనిపిస్తుంది. కావచ్చు-కాకపోవచ్చు. అయితే- ’ఆత్మకధ’ కాకపోయుంటే ఇంత గొప్పగా రాయలేరు సుమా -అనిపిస్తుందా కధాసరళి.
- అప్పట్లో...కాసిని కాఫీ నీళ్ళు పొయ్యిమీద ’పడేయడం’.....కుంపటి రాజేసి....పొగ గొట్టంతో ఊదటం....అరుగుమీద కూర్చుని పనీపాటా లేక కూని రాగాలు తీసే ఇర్రెస్పాంసిబుల్ తండ్రి.....నెలకి నలభై రూపాయల జీతంగల టీచరమ్మ.....పిల్లాజల్లా తో జట్కా బండిలో కాకరపర్రు ప్రయాణం.....ఇలా ఎన్నో ఈతరంవాళ్ళకి తెలీని ముచ్చట్లతో....అద్భుత శైలీ గమనంతో చదువరులనాకట్టుకుంటుందీ నవల. దీనికి తప్పకుండా పుస్తక రూపం వచ్చుంటుంది కాబట్టి.....దొరికితే తప్పకుండా పుస్తకప్రియులు చదవాల్సిన పుస్తకం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి