- బ్లాగుల్లో ’కవిత్వం’- ఆ మాటకొస్తే ఏ ’సాహితీ వ్యాసంగమైనా’ తామరతంపరగా విస్తరించడానికి కారణం "ప్రచురణా వేగం"! నత్తనడక టపాలు (స్నైల్ మెయిల్) రోజుల్లో ఓ స్టాంపు లేదా బ్రాండ్ పడినవాడు రాస్తేనే ’కవిత్వం’పత్రికాధిపతులకి! మరోడు రాస్తే ’కపిత్వం’!! బుట్ట దాఖలు. వెలుగు చూసిందే కవిత్వం. ఇంక ఎవడు రాసి ట్రంకు పెట్టెలో పెట్టుకుంటాడు ఏ సినిసిస్టో, రీసర్చి స్కాల్రో తప్ప. గతం గతః
బ్లాగ"రిస్టుల" అంతర్జాలమధనాలలో, జాలాఘాతాలలో ’పత్రికాగ్రేసరుల’కత్తెరలు తుత్తినియలయ్యాయి. చిత్తుబుట్టలు అటకలెక్కాయి. సదరు సంపాదకులు ’కంటెంట్’ సంపాదనకు - సామాన్య రచయితలకై అసామాన్యరీతిలో శోధనావేశం చూపిస్తున్నారు! రచనా సృష్టికి పుష్టికి ’ఆర్భాట శూరత్వం’కానీ ’పీయార్’టాలంటులు కానీ పడికట్టు రాళ్ళు కావనీ ’సృజనాత్మక వైచిత్రే’ముఖ్యలక్షణమనీ గుర్తెరిగి బ్లాగ్లోకానికి మల్లెపూదండ వేస్తున్నారు. కొత్త కొత్త రచయితలని వీళ్ళేమాత్రం అడ్డుకోలేక పోయారు. శవ రచనలకి పూజలు మానుకోవాల్సొచ్చింది. కొత్తబంగారు లోకం వీరి చెత్తబుట్టల్ని తిరిగి వారి చెత్తబుర్రల్లోకే నెట్టింది. అయితే ’స్నైల్ మెయిల్’ పోయి ’ఈ మెయిల్’ ఎక్కాల్సిన "ప్రచురణార్ధం పంపించే రచనలు" ఇంకా తపాలా ద్వారా పంపించే ఖర్మ రచయితలకెందుకో అర్ధం కావటంలేదు. ఆ తపాలా మూటల్ని తపోవనంలో మగ్గపెట్టబడి ఆనక ఎప్పుడు ఆవిష్కృతమౌతాయో తెలీని పరిస్థితి. - పత్రికల సంగతి ఇలాఉంటే కొన్ని ’సాహితీ పీఠాలో’ ’కవితా సమితులో ’ ’కల్చరల్ ట్రస్టులో’ మరోటో - కవిత్వం పంపుకో- దాంతో వంద రూపాయలు (జోకేంటంటే - దాంతో సరిపడేన్ని పోస్టల్ స్టాంపుతో సహా) వదిలించుకో - ఏళ్ళూ పూళ్ళు ఎదురుచూస్కో - రిప్లయి రాకపోతే మూస్కో) తరహాలో రెచ్చిపోవడం - ఓ బిజినెస్స్ అందామా! ఆఖరికి ఏ గుడి వెనకాలో మునిసిపాలిటీ మార్కెట్ మూలనో ఓ ’టేబుల్ సభ’ పెట్టి నోబుల్ గా క్రతువు ముగించేయడం ఎవరికి తెలీదు? ఆ టక్కులమారి ట్రస్టేశ్వర్రావులు మాత్రం కాలగమనంలో ’సాహితీ సామ్రాట్’ ’సభా విరాట్’ వగైరా బిరుదాంకితులై అలరారుతూంటారు. అది వేరే సంగతి.
- ఈ సాహితీ ముష్కరత్వానికి పిండప్రదానం చేసి రచనాజ్వాలలతో చమక్కుమంటున్న ’బ్లాగుబావుటాల ’కి జేజేలు పలుకుతున్నా.....అంతర్జాల సాహితీ విశ్వంభర కి రెండుచేతులెత్తి నమోవాకాలర్పిస్తున్నా!!
22, మే 2011, ఆదివారం
రచనాజ్వాలలతో చమక్కుమంటున్న ’బ్లాగుబావుటాల ’కి జేజేలు!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి